శీర్షాసనంలో మహాశివుడు అదీ సతీ, పుత్ర సమేతుడైన ఆలయం శక్తీశ్వర ఆలయం. ఇలాంటి ఆలయం మరొకటి ఎక్కడా వుండి వుండకపోవచ్చు. స్వయంభువుడిగా శివుడు వెలసిన శక్తీశ్వర ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 4 కి.మీ. దూరంలో గల యనమదుర్రు గ్రామంలో కలదు.
ఈ శివాలయం ఎంతో ప్రత్యేకమైంది..
శివాలయాలలో స్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ శక్తీశ్వరాలయంలో మాత్రం శివుడు పార్వతీ సమేతుడై, ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఈ ఆలయానికున్న ప్రత్యేకత. శివపార్వతులు వెలసిన పీఠం ఏకపీఠం కావడం ఒక విశేషమైనతే, ఇదంతా ఒక పెద్ద శిలగా భూగర్భంలో నుంచి చొచ్చుకుని వుండడం మరొక అద్భుతం. శక్తీశ్వరుడు ఈ ఆలయంలో శీర్షాశనంలో తపోనిష్టుడై ఉండడం మరో మహాద్భుతం. జటాఝూటం, నొసట విభూతి రేఖలు, నాగాభరణము స్వామి వారి విగ్రహంలో స్పష్టంగా కనపడతాయి.
స్థల పురాణం
శంబరుడనే రాక్షసుని సంహరించేందుకు యముడు శివున్ని ప్రార్థించాడు. ఆ సమయంలో శివుడు యోగముద్రలో ఉండండతో పార్వతీ అమ్మవారు తన శక్తిని వరంగా అనుగ్రహించి యముడి బలాన్ని గొప్పగా పెంచింది. ఆ శక్తితో యముడు శంబరుణ్ని సంహరించాడు. యమధర్మరాజు కోరిక మేరకు శీర్షాసన స్థితిలో ఉన్న శివుడు అమ్మవారితో సహా ఈ క్షేత్రమునందు వెలిశాడు అనీ చరిత్రం.
శక్తిగుండం ప్రత్యేకత
ఈ ఆలయానికి తూర్పువైపున శక్తి గుండం అనే చెరువు వుంది. కాశీలోని గంగ అంతర్వాహినిగా ప్రవహించి ఈ చెరువులో కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ చెరువు తవ్వకాలలో సర్పం ఆకారంలో ఉన్న ఆరు అడుగుల శిల ఒకటి బయటపడింది. ఈ శిలను సుబ్రహ్మణ్యేశ్వరునిగా భావించి ఆలయంలో ప్రతిష్ఠించి, ఆనాటి నుంచి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ శక్తి గుండంలోని నీటితోనే స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. పూర్వం ఒకసారి ఈ చెరువును శుభ్రపరిచే క్రమంలో ఈ నీటిని వాడడం ఆపి, ఆ సమయంలో స్వామి వారి నైవేద్యానికి సమీపంలోని మరొక చెరువు నుంచి నీటిని తెచ్చి ప్రసాదం తయారు చేయడానికి ప్రయత్నించగా అది ఎంతకీ ఉడకలేదు. అప్పుడు శక్తి గుండంలోనే చిన్న గొయ్యిని తవ్వి, ఆ నీటితో ప్రసాదం తయారు చేయగా వెంటనే ఉడికింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ స్వామి వారికి శక్తి గుండంలోని నీటినే ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment